బండ్లబాపయ్య గారి జీవిత చరిత్ర

ఆశయ సిద్ధికోసం, అధిక ధనాన్ని వ్యయించి, అజ్ఞానపు చీకటిని పారద్రోలేందుకు విద్యా విజ్ఞాన జ్యోతులు వెలిగించిన మాననీయులు కీ|శే|| రావుసాహెబ్ బండ్ల బాపయ్యశెట్టి గారు. కష్టాలలో ఉన్న అనాధలను ఆదుకున్న ఆపద్బాంధవులు వారు, మంచికి పేరుగా నిలిచిన మాననీయులు ఆ బాపయ్యగారు.

 

దత్త పుత్రునిగా

ప్రకాశం జిల్లా, పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన దేవాంగ సేనాధిపతి, చతుర వాగ్వ్యవహారవేత్త బండ్ల లక్ష్మయ్యగారు సకల సద్గుణ సంపన్నయైన అక్కమాంబను వివాహమాడారు. వీరికి బసవయ్య, బాపయ్య అనే ఇద్దరు కుమారులు, ముత్తమాంబ, వీరమాంబ అనే ఇరువురు కుమార్తెలు కలిగారు. బాల్యం నుండే బాపయ్య చేతికి ఎముకలేని దాతగా పేరు పొందారు. ప్రకాశం జిల్లా, వేటపాలెం మండలం, రామన్నపేట పంచాయితి లోని రావూరిపేట వాస్తవ్యులైన బండ్ల వెంకయ్య, ఆదెమ్మ దంపతులు బాపయ్యగారి దాతృత్వపు హృదయాన్ని వ్యక్తిత్వాన్ని గుర్తించి, తమకు సంతానం లేనందున దత్త పుత్రునిగా స్వీకరించారు.

విదేశీ చేనేత వ్యాపారం

యువకుడైన బాపయ్య చేనేత వస్త్ర వ్యాపారులతో పరిచయం పెంచుకొని వారి సలహాలతో మద్రాసులో వ్యాపార రంగ ప్రవేశం చేసారు. తమిళ భాషను నేర్చుకొని తన చిన్న మేనమామ పింజల సుబ్బారాయుడుగారి అండదండలతో వస్తోత్పత్తి గావించి, ప్రముఖ మద్రాసు వ్యాపారిగా గుర్తించబడ్డారు. బాపయ్యగారికి తన పెద్ద మేనమామ పింజల అమ్మయ్యగారు తన కుమార్తె లక్ష్మి నిచ్చి వివాహం చేసారు. ఆ ఆది దంపతుల ఆదర్శ సంసార జీవితమునకు ఫలముగా లక్ష్మి గర్భం దాల్చింది. ఆమె నాగమ్మ అనే పాపకు జన్మనిచ్చి తనువు చాలించింది. బాపయ్యగారికి భార్య మరణం పిడుగు పాటైంది. కోరికలు పేకమేడలై కూలిపోయాయి. జంటనెడబాసిన చక్రవాక పక్షి వలె బాపయ్య గారు శోకారిలో మునిగిపోయారు. పెద్దల వత్తిడి వల్ల బాపయ్య తన రెండవ మేనమామ కుమార్తె మాణిక్యంబను భార్యగా స్వీకరించారు. ఆమె కూడా మృత్యువాత బడి కన్ను మూసింది. ఈ సంఘటనతో బాపయ్య దుఃఖసాగరంలో మునిగిపోయారు. మనస్సును దిట్టపరచుకొని వ్యాపార రంగం పై దృష్టి సారించారు.

బాపయ్య గారి వ్యాపారం మూడు పూవులు ఆరు కాయిలుగా ద్విగుణీకృతమైంది. తొవరు. కంబాయి లుంగీలు, కవిలసారంవంటి సన్నరకం వస్త్రాలను తయారు చేయించేవారు. సరుకు వలన, సింహళము, సింగపూరు, మలయా, పినాంగు వంటి దేశాలకు వస్త్రాలను ఎగుమతి చేశారు. వాటి అమ్మకాలకు అంగళ్ళను కూడ అచట నెలకొల్పారు. పేరుతోపాటు చేతి నిండుగా డబ్బును కూడ సంపాదించారు.

వరించిన అదృష్టం

1914లో ప్రధమ ప్రపంచ సంగ్రామం జరిగింది. జర్మనీ నియంత పేల్చిన బాంబులకు మద్రాసు నౌకాశ్రయం నాశనమైంది. బాపయ్యగారు పంపిన చేనేత సరుకు బేళ్ళన్ని భస్మమైనాయను వార్త దావానలంలా వ్యాపించింది. దాంతో ఆయన కుంగిపోయారు ఋణదాతలు ఊపిరి సల్పనీయలేదు. యుద్దభీతి కొంత తగ్గిన తరువాత బాపయ్యగారు సింగపూరు వెళ్ళి తమ చేనేత వస్త్ర నౌక క్షేమంగా చేరాయను వార్త తెలిసికొని ఆనందంతో ఉప్పొంగిపోయారు. సింగపూరులోనే వుండి “జావా” మున్నగు విదేశాలకు కూడా వ్యాపారాన్ని కొనసాగించి అత్యధిక ధనమును సంపాదించి 1918లో తన స్వగ్రామమైన వేటపాలెం చేరుకున్నారు.

వివాహం

బాపయ్యగారు మొట్టమొదటి వ్యాపార నిమిత్తం సింగపూరులో వున్న సమయంలో వ్యాపారానికి చేదోడు వాదోడుగా కడలూరికి చెందిన మువ్వల దొరస్వామిశెట్టియార్ గారు సహకరించారు. వారి మూడవ కుమార్తె శారదాంబనిచ్చి బాపయ్య గారికి వివాహం చేశారు. బాపయ్యగారు ఋణదాతలను పిలిచి సంతృప్తిగా భోజనాలు పెట్టి అసలు వడ్డీతో పాటు పట్టు వస్త్రాలనుగూడ వారికి కానుకగా సమర్పించారు. బాపయ్య దంపతులకు సర్వశ్రీ వెంకటేశ్వరరావు, విశ్వనాధరావు, చినబాపయ్య అనే ముగ్గురు ముత్యాల్లాంటి కుమారులు, పుష్పావతి అనే కుమార్తె జన్మించారు.

ఆప్త మిత్రులు

సమసమాజ స్థాపకుడు మద్రాసు నగర మేయరు, సర్ పెట్టి త్యాగరాయశెట్టిగారు, బాపయ్యగారు మంచి స్నేహితులు. వీరి స్నేహమును చూచి ఆనాటి ప్రజలు కృష్ణార్జునులుగా భావించారు. సమదర్శినీ పత్రిక ప్రధాన సంపాదకులు రావుబహుదూర్ పింజల సుబ్రహ్మణ్యంగారు, పానుగల్లు మహారాజు రామరాయణి గారు, రావుసాహెబ్ కుర్మా వెంకటరెడ్డినాయుడుగారు, ఎం.పి. పాత్రుడు గారు మొదలైన వారు బాపయ్యగారికి ఆప్తమిత్రులు.

గవర్నరు రాక -భవన నిర్మాణానికి శంఖుస్థాపన

మద్రాసు గవర్నరు లార్డు వెల్లింగ్టన్ జన్మదినోత్సవము శిల్పకళా శోభాయమైన రాజభవనంలో జరిగింది. జమీందారులు, న్యాయమూర్తులు, మంత్రివర్యులు, మిత్రులు, కార్యదర్శులు మున్నగువారు వారికి తగిన రీతిలో కానుకలు సమర్పించారు. ఆ సమయంలో బంగారు నాణాలు, మణులు పొదిగిన విలువైన పుష్పగుచ్చం గవర్నరుకు కానుకగా వచ్చింది. గవర్నరు ఆశ్చర్యపడి బహుమానము పంపినదెవరని ప్రశ్నించారు.

సమదర్శినీ పత్రికాధిపతియైన పింజల సుబ్రహ్మణ్యంగారు ఈ కానుకను పంపినది వర్తక శ్రేష్ఠుడైన బండ్ల బాపయ్య గారని, మీ ఆహ్వానము లేనందున ఈ కానుకను ఇంటనుండియే మీకు పంపినారని చెప్పినారు. గవర్నరు బాపయ్యగారిని తీసికొని రావలసినదిగా ఆదేశించారు.

బాపయ్యగారు మేయరుకు బంధువు, ముఖ్యమంత్రికి ప్రాణసఖుడని పింజల సుబ్రహ్మణ్యంగారు తెలిపి బాపయ్యగారిని వెంట తీసుకొని వచ్చారు. గవర్నరు మెచ్చుకొని బాపయ్యగారికి షేక్ హ్యాండు నిచ్చారు. దానితో వారిరువురి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ కలయిక ఫలితమే బాపయ్యగారి మాధ్యమిక పాఠశాల శంఖుస్థాపనకు గవర్నరు వేటపాలెం విచ్చేశారు.

ఉత్సాహాన్ని నింపిన ఊరేగింపు

తోట శేషాద్రినాయుడుగారు, బండ్ల భద్రయ్యగారు, బండ్ల వెంకయ్యగారు, పింజల సుబ్రహ్మణ్యంగారు కొందరు వాణిజ్య మిత్రుల ప్రోత్సాహంతో బాపయ్యగారు 1921 వ సంవత్సరంలో వేటపాలెంలో బండ్ల బాపయ్య మాధ్యమిక పాఠశాలను స్థాపించారు. 1922వ సం||లో పాఠశాలకు ఒక భవనాన్ని నిర్మించదలచి నాటి మద్రాసు గవర్నరు లార్డు వెల్లింగ్టన్ ను శంఖుస్థాపన చేయుటకు స్వయముగా ఆహ్వానించారు. మద్రాసు మేయరు పిట్టి త్యాగరాయశెట్టిగారు, ఎం.ఎల్.సి. పింజల సుబ్రహ్మణ్యంగారు వెంటరాగా గవర్నరు సతీసమేతంగా వేటపాలెం విచ్చేశారు. గవర్నరుగారు నడిచేందుకు వేటపాలెం రైల్వే స్టేషను నుండి పాఠశాల వరకు మల్లెపూవులు యను నేలపై పరిచారు.

బాపయ్యగారు, పురప్రముఖులు, అధికారులు, వెంటరాగా కవాతు ప్రదర్శనలతో, మంగళవాయిద్యములతో, స్వాగత సత్కారములతోగవర్నరు గారిని పాఠశాలకు తీసుకొని వచ్చారు గుత్తి వెంకటసుబ్బయ్యగారు కోటసుబ్బారాయుడు గారల పర్యవేక్షణలో బాలభటులు, రక్షకభటులు వేలకొలదిగా వచ్చిన ప్రజాసమూహమును అదుపులో జయ జయ జయ నినాదాల మధ్య గవర్నరు పాఠశాలకు శంఖుస్థాపన చేశారు. చూపులకు వ్యాపార ప్రముఖడైన బండ్ల బాపయ్య గవర్నరు వంటి మహనీయులను తెచ్చి శంఖుస్థాపన గావించినారని ప్రజలు మెచ్చుకొన్నారు. ఆనాడే నలభై వేల రూపాయలు వెచ్చించి విశాలమైన క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.

 

రావుసాహెబ్ బిరరుదు ప్రదానం

ప్రభుభక్తి, దేశభక్తి, దానగుణశక్తి, విద్యావైద్య సేవానురక్తి కలిగిన బాపయ్యగారు రావుసాహెబ్ బిరుదమునకు తగినవాడని ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం గుర్తించింది. బాపయ్యగారికి ఐదవ జార్జి ప్రభువు రావుసాహెబ్ బిరుదాన్ని యిచ్చి సత్కరించారు.

అపురూప స్వగృహ నిర్మాణం

బాపయ్యగారు సింగపూరు శిల్పులుతో చిత్ర శిల్పాలు చెక్కించి, రంగూను కలపతో రావూరిపేటలో రమ్యమగు భవన నిర్మాణం చేశారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి వేలాది మంది గృహప్రవేశ మహోత్సవమునకు రాగా పంచభక్ష్య పరమాన్నములతో, షడ్రసోపేతముగా భోజనాలను పెట్టారు. నేటికి ఆ భోజన విషయాలను పెద్దలు చెప్పుకోవడం ఒక విశేషం.

ధర్మకర్తగా – వైద్యాలయ నిర్మాణ దాతగా

బాపయ్యగారు తన తాత గారు నిర్మించిన విశ్వనాథాలయము జీర్ణావస్థలో నుండుటను చూచి దాని నిత్య నైవేద్య దీపారాధనలకు, ఉత్సవాల నిర్వహణకు, స్వచ్ఛందంగా మంచి పంట మాగాణములను మాన్యముగా వ్రాసి యిచ్చినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు బాపయ్యగారి కుటుంబ సభ్యులే ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. బాపయ్యగారు తమ తల్లి గారైన ఆదెమ్మ పేర రావూరిపేటలో స్థలమును దానముచేసి పదివేల రూపాయలతో వైద్యాలయ భవన నిర్మాణము చేసినారు. అదే నేటి ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా పేరుపొందింది.

 

పంచాయితీ సర్పంచ్ గా

పెద్దలు కోరగా బాపయ్యగారు వేటపాలెం పంచాయితీ అధ్యక్షులుగా ఎన్నికలలో పోటీ చేశారు. ఎన్నికలలో అఖండ గెలుపొందారు.అధ్యక్ష పదవిని మిక్కిలి దక్షతతో నిర్వహించి సాంఘిక సేవా తత్పరుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.పల్లెపల్లెకు వెళ్ళిబీదసాదల గోడు విని, కష్ట సుఖాలు తెలిసికొని అప్పటికప్పుడే తగిన సహాయం చేసేవారు.బీదవారు పన్ను చెల్లించలేకపోవడంతో యూనియన్ బోర్డు వారు వారి ఆస్తులను జప్తు చేయసాగారు. దానగుణసంపన్నుడైన బాపయ్యగారువారి జపులను నిలిపివేసి తానే వారు కటవలసిన పన్నులను చెల్లించి ఆదుకున్నారు.ప్రజలకు గల నీటి ఎద్దడిని తగినన్ని బావులనుత్రవ్వించి దాహార్తిని తీర్చారు.ఎన్నో ఆరోగ్య వసతులను ఏర్పాటు చేశారు. వీరు తాలూకా, జిలా త్వాలను పొంది ఉన్నతోద్యోగుల గౌరవాన్ని, యోగ్యతా పత్రాలను పొందారు. ఆంధ్ర దేవాంగ కో-ఆపరేటివ్ టెనెనుసంఘానికి గౌరవాధ్యక్షులుగా కూడ వీరు పనిచేశారు. దేవాంగ జనులకు భూవసతిని కల్పించి, తన కులానికి ప్రతినిధియై వెలుగొందారు. కొంత ధనమును ప్రజలీయగా,బాపయ్యగారు కొంత ధనమునిచ్చి దేవాంగ విద్యా నిధిని ఏర్పరచి పాఠశాలలో చదివే బాలబాలికలకు సగము జీతాలను కట్టుటకు ఏర్పాటు గావించారు. ఎంతోమంది బీద విద్యార్థులను ఆదుకున్నారు.

 

మద్రాసుమేయరు రాక

గవర్నరు వెల్లింగ్టన్ శంఖుస్థాపన చేసిన భవనాన్ని అధిక ధనాన్ని వెచ్చించి పూర్తి గావించారు. ది. 6-2-1927 న నాటి మద్రాసు మేయరు, హోంమెంబరు, అంజుమాను పీఠాధిపుడు రావుబహదూర్ మహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ గారిని వేటపాలెం రప్పించి బండ్ల బాపయ్య మాధ్యమిక పాఠశాల భవన ప్రారంభోత్సవం గావించారు. పాఠశాల చరిత్రలో ఇది మరపురాని సంఘటన.

 

శివైక్యం పొందిన బాపయ్యగారు

స్త్రీ జనాభ్యుదయానికి తోడ్పడాలనే సంకల్ప సిద్ధి కలిగిన మహిళ, బాపయ్యగారి ధర్మపత్ని శారదాంబ, ఈమె భర్తను ఒప్పించి బాలికలకు విద్యాగంధాన్ని అందించేందుకు “బండ్ల శారదాంబ విద్యాలయము”ను స్థాపించారు. చేనేత నూలు రేషణింగ్ మనిషిగా ఉద్యమంలో పాల్గొన్నారు. రావుసాహెబ్ బండ్ల బాపయ్యగారు దక్షతతో ఎన్నో అధ్యక్ష పదవుల నలంకరించి, నేర్పుగా వ్యాపారాభివృద్ధి కొనసాగించి, విద్యా, వైద్య సంఘ సేవా తత్పరుడుగా, స్నేహశీలిగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు పొంది ది.09-11-1928 వ తేదీన శివైక్యాన్ని పొందారు.

 

తండ్రి బాటలో తనయులు

కీర్తిశేషులు బండ్ల బాపయ్యగారి కుమారులు తండ్రి నడచిన బాటలో పయనించారు. దాన గుణానికి ప్రతీకలై నిలిచారు. బాపయ్యగారి మాతృదేవతైన బండ్ల ఆదెమ్మ వైద్యాలయం ప్రక్కనున్న ఏడు ఎకరాల భూమిని పంచాయితీ సమితికి దానం చేశారు. అదే నేడు బాపయ్య నగరుగా ప్రసిద్ధి గాంచినది.

 

భవన నిర్మాణాలు

వేటపాలెంలో బండ్ల బాపయ్యశెట్టిగారు పవిత్రాశయంతో 4-11-1921 న బండ్ల బాపయ్య హిందూ మాధ్యమిక పాఠశాల అను పేరున ఈ విద్యా సంస్థ నెలకొల్పి 5 1/2 ఎకరముల ప్రాంగణంలో శాశ్వత పాఠశాల భవనము నిర్మించి, రు. 15,000/-ల మూలధనమును కూడ ఏర్పరచిరి. వారి ఉదార దాతృత్వము వలన ఈ విద్యాలయమునకు శాశ్వత సుస్థిరత చేకూరినది. ఈ భవన నిర్మాణమునకు అప్పటి ప్రభుత్వం వారు రు. 12,457/-లు గ్రాంటుగా ఇవ్వగా బాపయ్యగారు తాము అదివరకే ఇచ్చియున్న మూలధనమునకు చేర్చిరి. వారిచే నెలకొల్పబడిన మాధ్యమిక పాఠశాల దినదినాభివృద్ధి పొందుచూ 1946లో హైస్కూలుగా, 1961లో హైయ్యర్ సెకండరీ స్కూలుగా, 1969లో జూనియర్ కాలేజిగా, 1981లో డిగ్రీ కళాశాలగా రూపు దిద్దుకున్నది. ఈ పాఠశాలలో ఒక భాగమున కొంత కాలము సెకండరీ గ్రేడు ట్రైనింగ్ తరగతులు కూడా నిర్వహింపబడి 400 మంది ఉపాధ్యాయులుగా శిక్షణ పొందుటకు అవకాశము కలిగినది.

పాఠశాల భవన నిర్మాణమునకు ప్రభుత్వము వారు 1961వ సం||లో రు. 46,500/-లు గ్రాంటు నివ్వగా ఆరు తరగతులకు అనువుగా ఒక చక్కని భవనము నిర్మింపబడినది. ఈ భవనమునకు బాపయ్యశెట్టిగారి కుమారులు కీ|| శే| వెంకటేశ్వరరావు గారు, కీ||శే||విశ్వనాధరావుగారు, చినబాపయ్యగా రు. 15,000/-లు విరాళము కూడా ఇచ్చియుండిరి. ఈ భవనముపై చెన్నై వాస్తవ్యులు మొదలియార్ గారు రు. 25,000/-లు విరాళముతో మరియొక హాలు “నాగవీడు హాలు” అను పేరిట నిర్మించబడినది.

కమిటీ సభ్యులు ఇచ్చిన విరాళములు, కమిటీ డబులతోఆఫీసుకు ఒక చక్కనిభవనము నిర్మించబడినది.ఇంటర్మీడియట్ పవుగా రెండు చక్కటి భవనములు కూడా నిర్మించుట జరిగినది.

 

విశిష్ట సేవలు అందించిన పాలకవర్గాలు

బాపయ్యగారి కుమారులు కీ||శే|| వెంకటేశ్వరరావుగారు, కీ|| శే|| విశ్వనాధరావుగారు, చినబాపయ్యగారు ప్రత్యేక శ్రద్ధతో సంసల అభివృద్ధికి ఎంతో కృషి సల్పారు. విద్యా సంస్థల పురోభివృద్ధికి సేవాభావంతో కమిటి ప్రెసిడెంటు హోదాలో కీ॥ శే|| బండ్ల సామిశెట్టిగారు, కీ|| శే|| బండ్ల సుబ్బారాయుడుగారు, కీ||శే|| బండ్ల వెంకటేశ్వరరావుగారు, సెక్రటరీ & కరస్పాండెంట్ హోదాలో కీ॥శే॥ బండ్ల వీరాస్వామిశెట్టిగారు, కీ|| శే|| తోట శేషాద్రినాయుడుగారు, కీ||శే|| బందా శ్రీరాములుపంతులుగారు, కీ||శే|| గుత్తి వెంకటసుబ్బయ్యగారు, కీ||శే|| అడుసుమల్లి శ్రీనివాసరావు పంతులుగారు, కీ||శే|| గొల్లపూడి రాధాకృష్ణయ్య శ్రేష్ఠిగారు, బండ్ల చినబాపయ్యగారు, డా॥ బట్ట వరప్రసాదరావుగారు, కీ||శే|| గుత్తి వెంకటసుబ్బారావుగారు, బండ్ల బాలవెంకటేశ్వర్లుగారు, కర్న లక్ష్మణరావుగారు,రొటేరియన్ గొల్లపూడి సీతారామ్ గారల సేవలు శ్లాఘనీయము. అంతే కాకుండా ఉపాధ్యక్షులుగా, సహాయ కార్యదర్శులుగా,కోశాధికారులుగా మరికొంతమంది చేసిన సేవలు మరువలేనివి.

 

పేదల పెన్నిధి వెంకటేశ్వరరావుగారు

బాపయ్యగారి కుమారుడు కీ|| శే|| వెంకటేశ్వరరావుగారు ఆనువంశిక అధ్యక్షులుగా 1951 నుండి 1990 వరకు పనిచేశారు. ఎంతో మంది పేదలకు చదువు అందుబాటులో లేని సమయంలో ఫీజులు కట్టి విద్యాసుగంధాన్ని అందించిన మహానుభావులు. వేటపాలెం పంచాయితి ప్రెసిడెంటుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజకీయాలలో ఇమడలేక ఆరు నెలల లోపు తన పదవికి రాజీనామా చేశారు. 10 సంవత్సరముల పాటు ఆంధ్ర బాల్ బ్యాట్ మింటన్ అసోసియేషన్ కు ఉపాధ్యక్షులుగా పనిచేశారు. బండ్ల బాపయ్య హిందూ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు.

 

పదవులకే వన్నె తెచ్చిన చినబాపయ్యగారు

బాపయ్యగారి కుమారుడు చినబాపయ్యగారు ఈ విద్యా సంస్థల్లో 30 సంవత్సరాలుగా ఉపాధ్యక్షులుగా, సెక్రటరీ & కరస్పాండెంట్‌గా, సహాయ కార్యదర్శిగా విశిష్ట సేవలు అందించారు. వీరు సెక్రటరీగా ఉన్న సమయంలోనే జూనియర్ కాలేజి ఏర్పడింది. ఆంధ్రా బాల్ బ్యాట్ మింటన్ అసోసియేషను ఉపాధ్యక్షులుగా 4 సం||లు పనిచేశారు. వెంకటేశ్వరరావుగారి మరణానంతరం వారి కుమారుడు రిటైర్డు లెఫ్టినెంట్ కల్నల్ బండ్ల అంకయ్యగారు ఆనువంశిక అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

 

అన్నదాత సీతారామ గారు

కళాశాలకు అనుబంధంగా పేద విద్యార్థులకు కీ|| శే|| గొల్లపూడి రాధాకృష్ణయ్య శ్రేష్ఠిగారు ఏర్పరచిన ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని వారి దత్త పుత్రుడు రొటేరియన్ గొల్లపూడి సీతారామ్ గారు కొనసాగిస్తూ విద్యాభివృద్ధికి ఎంతో సహాయ పడుతూ, కళాశాల అభివృద్ధి కొరకు స్వర్ణ గ్రామమందలి తమకు గల 4 ఎకరముల భూమిని కూడా కమిటీకి రిజిష్టరు చేశారు.

 

మాగాణి భూమి దాతకోటినాగులుగారు

జూనియర్ కళాశాలలోని దేవాంగ బీద విద్యార్థుల సహాయార్థం పందిళ్ళపల్లి గ్రామ వా॥లు కి||శే|| బండ్ల కోటినాగులుగా స్వర్ణ గ్రామంలో తమకు గల 4 ఎకరముల మాగాణి భూమిని విరాళముగా ఇచ్చి యుండిరి. దీనిపై వచ్చు ఆదాయములో పందిళ్ళపల్లి దేవాంగ విద్యార్థులకు అవసరమగు పుస్తకములు కొని ఇచ్చుట జరుగుచున్నది. ప్రభుత్వం వారు ఇచ్చిన సైక్లోన్ గ్రాంటుతోను. కోటినాగులుగారు ఇచ్చిన మాగాణి భూమిపై వచ్చు ఆదాయము విద్యార్థులకు ఖర్చు పెట్టగా మిగిలిన ధనముతో గ్రంథాలయ భవనము నిర్మింపబడినది.

 

ఆర్థిక సహాయాన్ని అందించిన దాతలు

రిటైర్డు ఎకనామిక్స్ లెక్చరర్ కుమారి కె. నాగమాంబ రు. 50,000/-లు ఆర్ధిక సహాయం అందజేయగా, మరికొంత కమిటి ధనాన్ని వెచ్చించి గ్రంథాలయం పైన ఒక భవనం నిర్మించుట జరిగినది. ప్రస్తుతము దానిని బోటనీ లా గా ఉపయోగించుచున్నారు. అన్నపూర్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ధర్మకర్తలు జాండ్రపేట వాస్తవ్యులు, పూర్వ విద్యార్థి అయిన సజ్జా వెంకటసుబ్బారావుగారు, సజ్జా సోమశేరరావుగారు, డా|| సజ్జా కోటేశ్వరరావుగారు, శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు అందించిన రు. 1,25,000/-ల విరాళంతో ఒక భవనం నిర్మించుట జరిగినది.దానిని జూవాలజీ లాబ్ గా ప్రస్తుతం ఉపయోగించుచున్నారు. సుమారు రు. 4,00,000/-ల కమిటీ డబ్బుతో ఇంటర్మీడియటకు రెండు తరగతి గదులు, ఆఫీసుకు ఒక గదితో చక్కని భవనము నిర్మించబడినది. రిటైర్డు ప్రిన్సిపల్ తోట శంకరరావుగారు రు. 50,000/-లు, రిటైర్డు కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీమతి కె. ప్రమీలాదేవిగారు రు. 50,000/-లు ఆర్థిక సహాయాన్ని అందించి కళాశాల అభివృద్ధికి చేయూత నందించారు. 1954 సంవత్సరపు ఎస్.ఎస్.ఎల్.సి. బ్యాచ్ వారు రు. 53,116/-ల విరాళాన్ని కమిటీకి అందజేశారు. అంతే కాకుండా విద్యార్థులలో విద్య యందు ఆసక్తికరమైన పోటీని పెంపొందించుటకై కొందరు దాతలు నిధులను ఏర్పాటు చేసియున్నారు.

 

ప్రస్తుత పాలకవర్గం

ప్రస్తుతము బండ్ల బాపయ్య విద్యా సంస్థల కమిటీ అధ్యక్షులుగా రిటైర్డు లెఫ్టినెంట్ కల్నల్ బండ్ల అంకయ్య గారు, ఉపాధ్యక్షులుగా రాటేరియన్ గొల్లపూడి సీతారామ్ గారు, సెక్రటరీ & కరస్పాండెంట్ గా బండ్ల చినబాపయ్యగారు, సహాయ కార్యదర్శిగా బండ్ల భాస్కరరావుగారు విశిష్ట సేవలు అందించుచున్నారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్ గా శ్రీమతి కె. భ్రమరాంబదేవిగారు సమర్థవంతముగా పదవీ బాధ్యతలు నిర్వహించుచున్నారు.పవిత్ర ఆశయంతో, నిష్కల్మష హృదయంతో కీర్తిశేషులు రావుసాహెబ్ బండ్ల బాపయ్యశెట్టిగారు నెలకొల్పిన ఈ విద్యా సంస్థలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడతాయని అనడంలో అతిశయోక్తి లేదు.